రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి సరికొత్త కథా అంశాన్ని ఎంచుకున్నారు. సమకాలీనులైన అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం ఇద్దరూ స్నేహితులైతే అనే ఊహాజనిత పాయింట్ తో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2020 జులై 30న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. షూటింగ్ ఆలస్యంగా జరుగుతుండడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని కొమరం భీం లుక్ లో, రాంచరణ్ ని అల్లూరి లుక్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా నేడు కొమరం భీం జయంతి. భీం జయంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కనీసం ఎన్టీఆర్ పాత్ర గురించి విశేషం ఏదైనా తెలియజేస్తారని అనుకున్నారు. 

కానీ ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కొమరం భీం జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఒక్క ట్వీట్ మాత్రం చేశారు. ఎన్టీఆర్ ని యంగ్ కొమరం భీంగా చూపించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆర్ఆర్ఆర్ టీం తెలిపింది. ఇది ఎన్టీఆర్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశమే. వచ్చే ఏడాది ఆరంభం నుంచి మాత్రమే ప్రమోషన్స్ మొదలుపెడితే బావుంటుందని రాజమౌళి భావిస్తున్నారేమో.