రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న 'RRR' సినిమాను భారీ బడ్జెట్ తో దర్శకుడు రాజమౌళి రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్‌లో వేసిన పెద్ద సెట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై భారీ యాక్షన్స్ సీన్స్ చిత్రీకరించారు రాజమౌళి.

ప్రస్తుతం యూనిట్ బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ స్పాట్ లో తీసుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ ఫోటోలో ఎన్టీఆర్ బాగా సన్నబడినట్లు కనిపిస్తున్నాడు. ఇక రాజమౌళి ఎప్పటిలానే  గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఆయన గడ్డం తీయరనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన అలియాభట్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్‌ ఇందులో కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

అజయ్‌ దేవగణ్‌ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కష్టపడుతోంది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న చిత్రాన్ని విడుదల చేస్తారు.