బాహుబలి సినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. టాలీవుడ్ యంగ్ జనరేషన్ టాప్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ లు హీరోలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా చిత్రయూనిట్ పెద్దగా అప్‌ డేట్స్‌ ఏమీ ఇవ్వలేదు. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకు ఓ ప్రెస్‌మీట్ నిర్వహించి నటీనటుల వివరాలను వెల్లడించిన జక్కన తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. అప్పటి నుంచి సినిమా టైటిల్‌, హీరోల ఫస్ట్ లుక్స్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ఉగాది కానుకగా సినిమా టైటిల్ లోగో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.

అయితే మరికొద్ది గంటల్లో టైటిల్ లోగో రిలీజ్ కానుండగా ఇప్పటికే టైటిల్ ఇదే అంటూ ఓ ప్రచారం మొదలైంది. సినిమా షూటింగ్ మొదలైన సమయంలో ఈ సినిమా రైజ్‌.. రివోల్ట్‌.. రివేంజ్‌ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్‌ కింద ట్యాగ్ లైన్‌ లా యాడ్ చేసిన టైటిల్ ను రివీల్ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అదే నిజమైతే అభిమానులు నిరాశచెందటం ఖాయం. మరి రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.

ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ తెలంగాన సాయుధ పోరాట యోధుడు కొమురం భీం పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్‌కు జోడిగా అలియా భట్ నటిస్తుండగా, తారక్‌ కు జోడిగా ఒలివియా మోరీస్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.