రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. ఫాంటసీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగోను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మోషన్‌ పోస్టర్‌లో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ల లుక్‌ లు ఎలా ఉండబోతున్నాయో రివీల్ చేశారు. ఇక సినిమా నేపథ్యం 1920 కాలంలో జరుగుతుందన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు.

సినిమా టైటిల్ `రౌద్రం రణం రుథిరం` అని ఫిక్స్‌ చేశారు. ఇద్దరు హీరోలను ఒకరు నీరు, మరొకరు నిప్పుగా చూపించారు. ఆసక్తికర గ్రాఫిక్స్‌ తో రూపొందించిన టీజర్‌కు కీరవాణి నేపథ్యం సంగీతం మరింత హైప్‌ తీసుకువచ్చింది. మోషన్‌ టీజర్‌తోనే గూస్ బంప్స్ తెప్పించిన జక్కన సినిమాతో రికార్డ్ లు తిరగరాయటం ఖాయం అని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.

చారిత్రక వీరులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీంల కథకు ఫాంటసీ అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ ఇద్దరు ఒకవేళ కలిసి ఉంటే ఆ పోరాటం ఎలా ఉండేది అన్న ఊహకు తెర రూపమే ఈ సినిమా. రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్‌ భామ ఒలివియా మోరిస్‌ నటిస్తోంది. బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది జూలైలోనే రిలీజ్ చేయాలని భావించినా నిర్మాణ కార్యక్రమాలు ఆలస్యం కావటంతో వాయిదా వేశారు. 2021 జనవరి 8న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించిన రాజమౌళి తాజా మోషన్ పోస్టర్‌తో మరోసారి అదే డేట్‌ న సినిమా రిలీజ్‌ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు.