నితిన్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ భీష్మ. 'సింగల్ ఫరెవర్' అనేది క్యాప్షన్. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. గత ఏడాది శ్రీనివాస కళ్యాణం, ఛల్ మోహన్ రంగ లాంటి నిరాశాజనకమైన ఫలితాలు ఎదుర్కొన్న నితిన్ ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలపై దృష్టి పెట్టాడు. భీష్మ చిత్రంతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోయివాలని ప్రయత్నిస్తున్నాడు. 

తాజాగా భీష్మ చిత్ర యూనిట్ దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసింది. రొమాంటిక్ గా ఉండే ఓ పోస్టర్, నితిన్ యాక్షన్ సన్నివేశాల్లో పెర్ఫామ్ చేస్తున్న మరో పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ రెండు పోస్టర్స్ లో నితిన్ లుక్ ఆకట్టుకుంటోంది. 

చీర కట్టులో అందంగా కనిపిస్తున్న రష్మిక వెనకాల నితిన్ పడుతున్న లుక్ ఈ చిత్రంలోని రొమాంటిక్ యాంగిల్ ని రివీల్ చేస్తోంది. అలాగే మాస్ ప్రియులకు కావలసిన పోరాట సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపేలా మరో పోస్టర్ ఉంది. 

గతంలో నితిన్ దశాబ్ద కాలం పాటు విజయాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అ.. ఆ.. లాంటి చిత్రాలు నితిన్ మార్కెట్ ని పెంచుతూ వచ్చాయి. ప్రస్తుతం నితిన్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. అది నిలబడాలంటే భీష్మ చిత్రంతో నితిన్ సక్సెస్ అందుకోవాలి. 

భీష్మ చిత్రం తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో మూవీ లో నటించబోతున్నాడు.