బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఇటీవలే క్యాన్సర్ నుండి కోలుకొని ముంబై చేరుకున్నారు. తన వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే రిషి కపూర్ తాజాగా మరోసారి నెటిజన్లకు కోపం తెప్పించారు. దసరా పండగ అంటే హిందువులకు ఎంత పవిత్రమైన పండగో అందరికీ తెలిసిందే. అటువంటి పండగరోజు ఇతరుల మనోభావాలు అపహాస్యం చేసే విధంగా 
సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రిషి కపూర్.

సాధారణంగా దసరా రోజు ఆయుధ పూజలు చేయడం హిందువుల సంప్రదాయం. అలానే వాహనాలకు, ఇంట్లో ముఖ్యమైన వస్తువులకు పూజలు చేస్తుంటారు. అయితే రిషి కపూర్ మాత్రం బాటిల్ ఓపెనర్ కి ఆయుధ పూజ చేశారట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఇదే నా ఆయుధ పూజ. దీనిని బాధ్యతగా వాడాలి' అని పోస్ట్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ సీనియర్ నటుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు ఇలాంటి మెసేజ్ లు చేయడం ఏం బాలేదంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. 'ఆయుధానికి, పరికరానికి తేడా తెలిదా..?' అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రిషి కపూర్ కి ఇలాంటి ట్రోలింగ్ కొత్తేమీ కాదు. అందుకే ఆ పోస్ట్ ని డిలీట్ చేయడం కానీ, క్షమాపణలు చెప్పడం కానీ చేయలేదు.

క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం దాదాపు పదకొండు నెలలు అమెరికాలో ఉన్న రిషి కపూర్ ఇటీవల ముంబై చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏ సినిమాకి సైన్ చేయలేదు. తన భార్యతో కలిసి ఇటలీ టూర్ కి వెళ్లారు. తిరిగి వచ్చిన తరువాత సినిమాల్లో నటించే ఛాన్స్ ఉంది.