అనేక వివాదాలు, విమర్శలు, హంగామా అనంతరం  ఆర్జీవీ `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` థియేట‌ర్ల‌లో రిలీజైంది. అయితే లాస్ట్ మినిట్ లో సెన్సార్ పూర్తి చేసి హడావిడిగా రిలీజ్ పెట్టడంతో చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయ్యిందనే విషయమే తెలియలేదు. తెలిసిన ఆ కొద్ది మంది ..ఆ ఏం చూస్తాములే అనుకోవటంతో నిన్న రిలీజ్ రోజు మార్నింగ్ షోలు చాలా చోట్ల కాన్సిల్ అయ్యాయి.

ఇక వర్మ చేసిన  ప్ర‌చారార్భాటం చూసి ఏదో మ్యాజిక్ చేస్తాడ‌ని ఆశించిన వారికి పూర్తి స్దాయి నిరాశే ఎదురైంది.దాంతో చూసిన కొద్ది మందీ కూడా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయటం మొదలెట్టారు. ఇక రివ్యూలు అయితే అతి దారుణంగా వచ్చాయి.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ మార్నింగ్ షోకు  ఉన్నవి..మ్యాట్నీకు తగ్గితే, ఫస్ట్ షో,సెకండ్ షోలకు మరీ షాకిచ్చే స్దాయికి పడిపోయాయని ట్రేడ్ వర్గాల సమాచారం.  అయితే కొన్ని బి, సి సెంటర్లలో మాత్రం కలెక్షన్స్ ఫరవాలేదనిపిస్తున్నట్లు చెప్తున్నారు.

అయితే  ఫస్ట్ డే కలెక్షన్లు కూడా కుమ్మేసాయని చిత్ర యూనిట్ చెపుతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సినిమా వందకి వెయ్యి శాతం బ్లాక్ బస్టర్ హిట్టు అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘తొలిరోజు కలెక్షన్లు గర్జిస్తున్నాయి. కల్పిత సన్నివేశాల్లో రియల్ క్యారెక్టర్స్‌పై కల్పిత పాత్రలతో తెరకెక్కించిన ఈ కొత్త జోనర్ సినిమాను ప్రజలు బాగా ఆదరించారని దీనిని బట్టే అర్థమవుతోంది’ అంటూ రిలీజ్ ట్రైలర్స్ వీడియోను విడుదల చేశారు.

ఇక తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించటం ప్లస్ పాయింట్. ఫస్ట్ వీకెండ్  వసూళ్లు యావరేజ్ గా వచ్చినా ఒడ్డున పడిపోవచ్చు. సినిమాలో చాలా మంది కొత్త నటీనటులే కావడంతో బడ్జెట్ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం రాలేదు. ఉన్నంతలో అలీ, బ్రహ్మానందం, ధన్‌రాజ్, కత్తి మహేష్‌లకు కాస్త ఎక్కువ రెమ్యునేషన్ ముట్టినట్లు తెలుస్తోంది.