సినిమా అనేది చాలా సెన్సిటివ్‌ విషయం. ఏ మాత్రం పొరపాటు జరిగిన  ఇతరుల మనోభావాలు దెబ్బతినటం ఖాయం. ఒక్కోసారి యూనిట్ లో ఎవరో చేసిన తప్పులకు సినిమా హీరో, దర్శకుడు, నిర్మాతలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి పరిస్థితే తాజాగా మలయాళ యంగ్ హీరో దుల్కర్‌ సల్మాన్‌కు ఎదురైంది.

దుల్కర్ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం వారనె అవశ్యముండ్. ఈ సినిమాలో ఓ కీలక సన్నివేశంలో ముంబైకి చెందిన ఓ జర్నలిస్ట్ ఫోటోను అవమానకరంగా ఉపయోగించారు. అయితే ఆ ఫోటో వాడేందుకు సదరు జర్నలిస్ట్ నుంచి ఎలాంటి అనుమతీ తీసుకోలేదు. అక్కడే వచ్చింది అసలు సమస్య. సినిమాలో తన ఫోటో ఉపయోగించిన విషయం ఆ జర్నలిస్ట్ దృష్టికి వెళ్లటంతో ఆయన ఫైర్‌ అయ్యారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బాడీ షేమింగ్‌ను అంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇతరుల శరీరం గురించి అవమానకర వ్యాఖ్యలు చేసే వారికి చట్టపరంగా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సదరు రిపోర్టర్‌ సినిమాలో తన ఫొటోను అవమానకరంగా చూపించారని, తన పర్మిషన్‌ లేకుండా ఇలా చేయడం ఏంటని, సినిమా నుంచి తన ఫొటోను తీసివేయాలని అది కుదరని పక్షంలో బ్లర్ చేయాలని హీరో దుల్కర్ సల్మాన్ తో పాటు దర్శకుడిని ట్యాగ్ చేస్తూ చేతన ట్వీట్ చేశాడు.

వివాదాన్ని మరింత పెంచకుండా హీరో దుల్కర్ వెంటనే స్పందించాడు. జరిగిన తప్పుకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో వెంటనే తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని వెళ్లడించాడు. అంతేకాదు చిత్రబృందం తరుపున దుల్కర్‌ స్వయంగా ఆ వ్యక్తిని క్షమాపణలు కూడా కోరాడు. దుల్కర్‌ స్పందించిన తీరుపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.