పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న దగ్గర నుంచి రేణు దేశాయ్‌కి సోషల్ మీడియాలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పవన్‌ వీరాభిమానులు రేణును టార్గెట్ చేస్తూ అభ్యంతర కర పోస్ట్ లు చేసేవాళ్లు. అయితే మొదట్లో ఈ పోస్ట్ పై ఆవేదన వ్యక్తం చేసిన రేణు, తరువాత రిప్లై ఇవ్వటం ప్రారంభించింది. కొద్ది రోజుల తరువాత రిప్లై ఇవ్వటం కూడా మానేసింది. కొంత కాలంగా పవన్, గురించి గానీ మెగా ఫ్యామిలీ గురించిగానీ ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు రేణు.

ఇటీవల పవన్‌ రేణుల కొడుకు అకీరా పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరోలంతా శుభాకాంక్షలు తెలిపినా రేణు స్పందించలేదు. అయితే ఈ రోజు (సోమవారం)కి బద్రి సినిమా రిలీజ్‌ అయి20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వరుస ట్వీట్‌లు చేసింది రేణు. అయితే ఈ ట్వీట్లపై కూడా కొందరు ఆకతాయిలు అభ్యంతరకర ట్వీట్ లు చేశారు.

ఈ ట్వీట్‌లపై రేణు స్పందించింది. `ఈ రేణుదేశాయ్ ఏంటో మళ్లీ కెలుకుతోంది. అవసరమా ఇప్పుడు... ఆ మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేసింది. మళ్లీ ఈ పోస్ట్‌లు ఎందుకు? ఎంగేజ్‌మెంట్ అయ్యింది కదా... ఆ విషయం ఏమైంది?` అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేసిన రేణుదేశాయ్‌ గట్టి కౌంటర్ ఇచ్చింది.

`అవసరం ఆ..?... అవును అవసరం. బద్రీ వచ్చి నేటికి 20 ఏళ్లు. నా మొదటి సినిమా అయిన ఈ సినిమాను చాలామంది మరిచిపోతారు. ఆ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. ఇంత ద్వేషం ఎందుకు అన్నా? మనం ఇప్పటికే ఈ వైరస్ వల్ల చాలా కష్టాల్లో ఉన్నాం. ఇంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు` కామెంట్ చేసింది రేణు.