రవితేజ ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. మాస్ మహారాజాకు అర్జెంట్ గా ఓ హిట్ అవసరం. డిస్కో రాజా చిత్రం విభిన్న కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం విడుదల కాకముందే రవితేజ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

బలుపు లాంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన గోపీచంద్ మలినేని రవితేజతో మరో మూవీ చేయబోతున్నాడు. రవితేజ 66వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శత్వంలోనే ఉండబోతోంది. ఇటీవల గోపీచంద్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ప్రీలుక్ ని రిలీజ్ చేశారు. షాడో ఇమేజ్ లో రవితేజ తుపాకీ పట్టుకుని కనిపిస్తున్నాడు. బహుశా ఈ చిత్రంలో రవితేజ పోలీస్ అధికారిగా నటించబోతున్నాడేమో. 

రవితేజ సరసన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ నటులు వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించనున్నారు. తమన్ సంగీత దర్శకుడు కాగా.. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.