టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఏ సినిమా చేసినా అందులో ఎదో ఒక కొత్తదనం ఉంటుంది. గతకొంత కాలంగా ఊహించని విధంగా అపజయాలు ఎదుర్కొంటున్న మాస్ రాజా ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని పలు డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం డిస్కోరాజా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఆ సైన్స్ ఫిక్షన్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక తనకు డాన్ శీను - బలుపు సినిమాలతో మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. అయితే ఆ సినిమాలో రవితేజ గత సినిమాల మాదిరిగా సక్సెస్ ఫార్ములాను వాడబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ సినిమాల్లో మెయిన్ గా ఆడియెన్స్ కోరుకునేది కామెడీ.  విక్రమార్కుడు సినిమాలో కామెడీతో ఆడియెన్స్ ని ఒక వైపు నవ్విస్తూనే మరోవైపు తన యాక్షన్ తో సీరియస్ మోడ్ లోకి తీసుకువెళతారు.

అలాగే క్రాక్ సినిమాలో కూడా మాస్ రాజా రెండు విభిన్నమైన పాత్రలతో అలరించనున్నాడట. ఒక క్యారెక్టర్ తో నవ్విస్తూ మరో పాత్రతో ఆడియెన్స్ కి మాస్ లో యాక్షన్ డోస్ ని ఎక్కించనున్నాడట. చాలా సినిమాల్లో ఈ ఫార్ములా క్లిక్కయ్యింది. దర్శకుడు కూడా స్పెషల్ స్క్రీన్ ప్లేతో సినిమాను రెడీ చేస్తున్నట్లు సమాచారం.  ఇక ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్ పూర్త‌య్యాయి.

ఇది వ‌ర‌కు విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్‌లో ర‌వితేజ మాస్ లుక్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ర‌వితేజ ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఇన్‌టెన్స్ లుక్‌, చేతిలో గోలీసోడాను ప‌ట్టుకున్న ర‌వితేజ `క్రాక్` సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.  ఈ లుక్‌లో ర‌వితేజ బ్యాక్‌సైడ్ ఖైదీలు నిల‌బ‌డి ఉండ‌టాన్ని చూడొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్‌తో డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. స‌ర‌స్వ‌తి ఫిలిమ్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. మెర్స‌ల్‌, బిగిల్ చిత్రాల‌ల్లో విజువ‌ల్ బ్యూటీ అందించిన జి.కె.విష్ణు ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.