మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. టచ్ చేసి చూడు, నేల టికెట్టు లాంటి డిజాస్టర్ చిత్రాల తర్వాత రవితేజ నుంచి రాబోతున్న చిత్రం ఇది. వరుస పరాజయాలతో రవితేజ మార్కెట్ తగ్గుతోంది. దీనితో రవితేజ కెరీర్ కు డిస్కోరాజా మూవీ కీలకం కానుంది. 

ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలు వచ్చాయి. దీనితో డిస్కోరాజా మూవీపై మంచి అంచనాలు నెలకొనిఉన్నాయి. 

తాజాగా చిత్ర యూనిట్ డిస్కోరాజా టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ సినిమాపై ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉంది. రవితేజ పాత్రని సరదాగా చూపిస్తూనే.. కథలో ఓ మెడికల్ ప్రయోగాన్ని ఇన్వాల్వ్ చేసినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. రవితేజ మద్యం గ్లాసుతో సరదాగా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత బ్యాగ్రౌండ్ లో వినిపించే ఆసక్తికరమైన వాయిస్ తో కథ గురించి కొంచెం హింట్ ఇచ్చే ప్రయత్నాన్ని దర్శకుడు చేశారు. 

మెడిసిన్ మార్పుకు కారణం అంటూ ఆంగ్లంలో డైలాగ్ వినిపిస్తుంది. 'మనం ఈ ప్రాజెక్ట్ చేయకూడదని ఇండియన్ రీసెర్చ్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది' అని ఫిమేల్ వాయిస్ తో మరో డైలాగ్ వినిపిస్తుంది. 'వీడైతే నో రిపోర్ట్స్.. నో రికార్డ్స్.. నో రిలేటివ్స్.. జీరో రిక్స్' అంటూ రవితేజపై ఏదో మెడికల్ ప్రయోగం చేయబోతున్నట్లు చూపించారు. 

టీజర్ లో చూపిన యాక్షన్ స్టంట్స్, రవితేజ మ్యానరిజమ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజిని తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుట్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న డిస్కోరాజా చిత్రాన్ని జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.