కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ, ప్రజల్లో ధైర్యం నిపేందుకు సెలబ్రిటీలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఈ లాక్ డౌన్‌ సమయంలో తామంతా ఎలా టైం స్పెండ్ చేస్తున్నారో అభిమానులకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హాట్‌ బ్యూటీ రష్మిక మందన్న కూడా తన వంతుగా అభిమానుల్లో అవేర్‌నెస్ కలిగించే ప్రయత్నం చేస్తోంది.

ఇటీవల ప్రధాని మోడీ పిలుపు మేరకు తాను కూడా దీపం వెలిగించి దేశ ఐక్యతను చాటింది రష్మిక. అయితే ఆ ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఈ బ్యూటీ కరోనాపై పోరాటం విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. `ఏ సమయంలోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. ఇప్పుడు మనం రణ క్షేత్రంలో ఉన్నాం. ఈ పోరాటంలో మనం తప్పని సరిగా విజయం సాధిస్తాం. మీకు వీలైనంత వరకు ఇతరులకు సాయం చేయండి` అంటూ కామెంట్ చేసింది.

ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుకు జోడిగా నటించిన రష్మిక మందన్న బ్లాక్ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పలు కన్నడ చిత్రాలతో పాటు టాలీవుడ్‌ లో అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.