బాలీవుడ్ లో కంగనా రనౌత్ ఓ ఫైర్ బ్రాండ్. నటిగా ఎంతటి గుర్తింపు సొంతం చేసుకుందో.. అలాగే వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గతంలో కంగనా రనౌత్ పలు వివాదాల్లో కేంద్రబిందువుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కంగనా రనౌత్ కొందరు బాలీవుడ్ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. 

ఇటీవల కంగనాకు మద్దతుగా ఆమె సోదరి రంగోలి రంగంలోకి దిగింది. కంగనా రనౌత్ పై వస్తున్న విమర్శలని రంగోలి తిప్పికొడుతూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రముఖ ఫోర్బ్స్ సంస్థ ఇండియాలో బడా సెలెబ్రిటీల జాబితాని విడుదల చేసింది. 

అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ నిలిచారు. కాగా కంగనా రనౌత్ 70వ స్థానాన్ని దక్కించుకుంది. దీనితో ఫోర్బ్స్ జాబితాపై కంగనా సోదరి రంగోలి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

ఇది ఒక మోసపూరిత జాబితా. సెలెబ్రిటీల ఆదయ వివరాలు మీకు ఎలా తెలిసాయి అని రంగోలి ప్రశ్నించారు. మీరు ప్రకటించిన జాబితాలో సెలెబ్రిటీల ఆదయ వివరాలు, సంపాదన నిజమే అని నిరూపించగలరా అంటూ ఫోర్బ్స్ కు రంగోలి ఛాలెంజ్ విసిరింది. 

కంగనాకు వచ్చే ఆదాయం కంటే ట్యాక్స్ ఎక్కువగా కడుతోంది. ఇలాంటి అసత్యపూరితమైన జాబితాలో వివరాలు ఎలా ప్రకటిస్తారు అని రంగోలి మండిపడింది. ఈ ఏడాది కంగనా రనౌత్ కు వచ్చిన ఆదాయం గురించి ఆమెకు కూడా తెలియదు. ఆ వివరాలు నాకు, అకౌంట్స్ డిపార్ట్ మెంట్ కి మాత్రమే తెలుసు. మీకు ఈ వివరాలు ఎవరు లీక్ చేశారు. అసలు ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అని రంగోలి ఫోర్బ్స్ సంస్థపై అసహనం వ్యక్తం చేసింది.