దగ్గుబాటి రానా ఆరోగ్యం విషయంలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తనకేమీ కాలేదని, ఆరిగ్యంగానే ఉన్నట్లు రానా కుటుంబ సభ్యులు చెబుతున్నా..రానా బాగా సన్నబడడం, హైదరాబాద్ కి దూరంగా ఉంటుండడంతో అనుమానాలు పెరిగిపోయాయి. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన రానా తిరిగి ఇండియా వచ్చినా హైదరాబాద్ కి మాత్రం రాలేదు. ముంబైలో డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నాడు.

అయితే సినిమాల పరంగా మాత్రం రానా ప్రాజెక్ట్ ల మీద ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటూనే ఉన్నాడు. రెండు పెద్ద ప్రాజెక్ట్ లు రానా కోసం ఎదురుచూస్తున్నాయి. అందులో ఒకటి 'హాథీ మేరీ సాథీ'.  సోలో హీరోగా రానా కెరీర్ లో అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. గతేడాది సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు.

దానికి కారణం రానా తీసుకుంటున్న బ్రేకులే.. ఇక ఈ ఏడాదే మొదలైన 'విరాట పర్వం' సినిమా కూడా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం జరిగితే ఈ పాటికి పూర్తయ్యేది. కానీ బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు మధ్యలో బ్రేక్ పడగా.. గుణశేఖర్ తలకెత్తుకున్న భారీ సినిమా 'హిరణ్య కశ్యప' సినిమా ఇప్పటివరకు ప్రీప్రొడక్షన్ స్టేజ్ ని దాటలేదు. 'హథీ మేరీ సాథీ', 'విరాటపర్వం' చిత్రాలు పూర్తయితే గానీ 'హిరణ్య కశ్యప' పట్టాలెక్కదు.

ఈ సినిమాల సంగతే తేలడం లేదంటే రానా ఇప్పుడు కొత్తగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక కొరియన్ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి రానా ఓకే చెప్పాడట. సురేష్ ప్రొడక్షన్స్ లో దీనికి సంబంధించిన వర్క్ నడుస్తోందని సమాచారం. ఈ సినిమాలో దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా కనిపించనుందని సమాచారం. గతంలో రానా, నయనతార కలిసి 'కృష్ణం వందే జగద్గురుం'లో నటించారు. ఇప్పుడు మరోసారి జత కట్టనున్నారు. మరి ముందు లైన్ లో ఉన్న మూడు ప్రాజెక్ట్ లు పూర్తయ్యి ఈ రీమేక్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే ఇంకెంత సమయం పడుతుందో చూడాలి!