అల్లు అర్జున్ గత ఏడాది నా పేరు సూర్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బన్నీ ఆర్మీమ్యాన్ గా నటించిన ఆ చిత్రం నిరాశపరిచింది. దీనితో అల్లు అర్జున్ వెంటనే తన అభిమానులకు మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలని భావించాడు. చాలా రోజులపాటు అనేక కథలని పరిశీలించాడు. 

చివరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపే మొగ్గు చూపాడు. ప్రస్తుతం వీరిద్దరి కంబోలోనే అల వైకుంఠపురములో చిత్రం తెరక్కుతోంది. అంతకు ముందు బన్నీ హిందీలో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ చిత్రం 'సోను కే టిటు కి స్వీటీ' రీమేక్ పై ఆసక్తి చూపాడు. 

ఈ చిత్రం తెలుగులో వర్కౌట్ అవుతుందని బన్నీ భావించడంతో కొన్ని రోజులు కసరత్తు కూడా జరిగింది. కానీ ఈ లోపు త్రివిక్రమ్ మంచి కథతో రావడంతో ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు 'సోను కే టిటు కి స్వీటీ' రీమేక్ రానా దగ్గుబాటి చేతుల్లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. 

రానా ఈ చిత్రానికి సంబందించిన వర్క్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఏఈ చిత్రంలో ఇద్దరు హీరోలు నటించాలి. ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్ రానాని కలిశాడు. దీనితో ఈ చిత్రంలో సెకండ్ హీరో విశ్వక్ సేన్ అనే ప్రచారం జరుగుతోంది. 

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన  'సోను కే టిటు కి స్వీటీ' హిందీలో కార్తీక్ ఆర్యన్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. రానా ఇప్పటికే వేణు ఊడుగుల దర్శత్వంలో 'విరాటపర్వం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సాయి పల్లవి హీరోయిన్.