తన తాత దేశంలోనే పేరుమోసిన బడా నిర్మాత. తండ్రి టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్. బాబాయ్ తిరుగులేని హీరో. ఇలా సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా దగ్గుబాటి ఎన్నడూ క్రేజ్ కోసం వెంపర్లాడలేదు. తొలి చిత్రం నుంచే నటుడిగా రాణించేందుకు ప్రయోగాలు మొదలు పెట్టాడు. 

రానా నటించిన తొలి చిత్రం లీడర్ మొదలుకొని ఆ మధ్యన వచ్చిన బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వరకు అన్ని ప్రయోగాత్మక చిత్రాలే. ప్రతి చిత్రంలో రానా తనదైన ముద్ర వేస్తూ విలక్షణ నటుడిగా ఎదిగాడు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలంతా ఒక్కొక్కరుగా ఓ ఇంటివారవుతున్నారు. కొన్ని రోజుల క్రితం రానా కూడా తన ప్రేయసిని అభిమానులకు పరిచయం చేశాడు. 

ఈవెంట్ మ్యానేజ్మెంట్ బిజినెస్ చేస్తున్న ముంబైకి చెందిన మిహీక బజాజ్ అనే యువతితో రానా కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే తనకు ఆమె ఓకె చెప్పిందని రానా రొమాంటిక్ ఫోటో తో మిహీకని అభిమానులకు పరిచయం చేశాడు. దీనితో మిహీక ఒక్కసారిగా అభిమానుల్లో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. 

ఈ ఏడాదే రానా, మిహీకాలకు వివాహం చేయనున్నట్లు సురేష్ బాబు కూడా ప్రకటించారు. తాజా సమాచారం మేరకు నేడు(బుధవారం) రామానాయుడు స్టూడియోలో లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా రానా, మిహీకా నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. 

లాక్ డౌన్ కారణంగా నిశ్చితార్థాన్ని గ్రాండ్ గా నిర్వహించడం లేదు. కేవలం కొద్దిమంది బంధువుల సమక్షంలో సింపుల్ గా పూర్తి చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు రానా, మిహీక నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ దిల్ రాజు.. హీరో నిఖిల్ ల వివాహం జరిగింది. రానా కూడా ఎంగేజ్మెంట్ తో సర్ ప్రైజ్ ఇస్తున్నాడు.