ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో రీమేక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా సౌత్ సినిమాలను బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్‌ చేస్తున్న వార్తలు తరచు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సౌత్‌లోనే ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేస్తున్నారు. తాజాగా మలయాళంలో సూపర్‌ హిట్ అయిన ఓ మల్టీ స్టారర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల మలయాళంలో సూపర్‌ హిట్ అయిన మల్టీ స్టారర్ మూవీ అయ్యప్పానుమ్‌ కుషియమ్‌. పృథ్వీ రాజ్‌, బిజూ మీనన్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కీలక పాత్రలో బాలకృష్ణను తీసుకోవాలనుకున్నారు. కానీ బాలకృష్ణ ఆ పాత్ర చేసేందుకు ఆసక్తికనబరచక పోవటంతో ఆ పాత్రలో రవితేజ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట.

రవితేజ ఓకే అంటే మరో పాత్రకు రానా రెడీగా ఉన్నాడు. రవితేజ కూడా ఆ పాత్రకు దాదాపు ఓకే చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. థ్రిల్లర్‌ సినిమాల స్పెషలిస్ట్‌ సుధీర్‌ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్టుగా సెట్ అయితే లాక్‌ డౌన్‌ పూర్తయిన వెంటనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.