లాక్ డౌన్ తో  ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో,  దూరదర్శన్ చానల్ పాత సీరియళ్లను పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్ర‌మంలో టీవీ ప్రేక్ష‌కుల కోసం దూర‌ద‌ర్శ‌న్ 80వ ద‌శ‌కంలో ఎంతో అల‌రించిన రామాయ‌ణం, మ‌హాభార‌తం, శ్రీకృష్ణ సీరియ‌ల్స్ పునఃప్ర‌సారం చేసింది. ఈ నేప‌థ్యంలోనే అప్ప‌ట్లోనే ఎంతో ప్రేక్ష‌కుల అభిమానం పొందిన రామాయ‌ణ్ సీరియ‌ల్ ఇప్పుడు కూడా స‌రికొత్త  రికార్డు సొంతం చేసుకుంది.   'రామాయణం' సీరియల్ ఏకంగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 

ఏప్రిల్ 16న ప్రసారమైన ఎపిసోడ్ తో రికార్డుల పుటల్లో చోటు సంపాదించింది. ఆ ఎపిసోడ్ ను 7.7 కోట్ల మంది వీక్షించారని అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పటివరకు ఓ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని ఇంతమంది వీక్షించడం ఎక్కడా లేదు. ఆ ఘనత మన రామాయణం సొంతం చేసుకుంది.ఏప్రిల్ 16న రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఎపిసోడ్ ను 7.7 కోట్ల మంది వీక్షించారని ప్రసార భారతి తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటివరకు అత్యధికంగా చూసిన ఎపిసోడ్ గా అమెరికా టీవీ కార్యక్రమం 'ఎంఏఎస్ హెచ్' (మొబైల్ ఆర్మీ సర్జికల్ హాస్పిటల్) నంబర్ వన్ ప్లేసులో కొనసాగింది. ఈ కార్యక్రమం ఎపిసోడ్ కు అప్పట్లో 5 కోట్ల వ్యూస్ వచ్చాయి.  యుద్ధం నేపథ్యంలో కామెడీ డ్రామాగా ఈ టీవీ సిరీస్ రూపొందించారు. ఇప్పుడు 'రామాయణం' రీ టెలికాస్ట్ ఎపిసోడ్ అయినా తిరుగులేని ఆదరణతో రికార్డు బద్దలు కొట్టి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.