హీరో రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే చిత్రం గుర్తుందిగా. రామ్, అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. ప్రణీత సుభాష్ కీలక పాత్రలో నటించింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. 

త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి ఎంటటైన్మెంట్ కారణంగా బాగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని 'ధూమ్ దార్ ఖిలాడీ' పేరుతో హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. 

సౌత్ ఇండియన్ చిత్రాలకు హిందీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. తెలుగు చిత్రాలని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లోకి వదిలితే చాలు వందల మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ చిత్రాలు దూసుకుపోతుంటాయి. డీజే, సరైనోడు లాంటి చిత్రాలు వందలకొద్దీ మిలియన్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. 

ఇక హలో గురు ప్రేమకోసమే చిత్రానికి కూడా యూట్యూబ్ లో హిందీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో 141 మిలియన్ల మంది వీక్షించారు. ఈ చిత్రం ద్వారా హీరో రామ్ మరే సౌత్ ఇండియన్ హీరోకి సాధ్యం కానీ రికార్డ్ ని అందుకున్నాడు. ఈ చిత్రం యూట్యూబ్ లో 1 మిలియన్ లైక్స్ దక్కించుకుంది. ఆ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ చిత్రం ఇదే. 

దీనితో హీరో రామ్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తో హ్యాపీగా ఉన్న రామ్ కు ఈ అరుదైన రికార్డ్ మరింత ఉత్సాహాన్ని ఇచ్చేదే.