వివాదాస్పద కథలతో నిత్యం వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' చిత్రంతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. వర్మ ఇటీవల ఎక్కువగా రాజకీయ వివాదాలతో కూడిన కథలనే ఎంచుకుంటున్నాడు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 

ఈ చిత్రానికి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని కులాల పేరుతో టైటిల్ ప్రకటించినప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్, ట్రైలర్స్ ని బట్టి చూస్తే వర్మ ఈ మూవీలో కొందరు రాజకీయ నాయకులని కించపరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర విడుదలని అడ్డుకునేందుకు హైకోర్టులో అనేక పిటీషన్లు నమోదయ్యాయి. 

దీనితో కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఇప్పట్లో విడుదల కావడం అనుమానంగా మారింది. ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా వర్మ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ చిత్రంలోని 'దండం బాబు' అంటూ సాగే ఐటెం సాంగ్ ని వర్మ రిలీజ్ చేశాడు. సాంగ్ మొత్తం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పాత్రలని కించపరిచే విధంగా లిరిక్స్, చిత్రీకరణ ఉన్నాయి. 

ఇప్పటి రాజకీయ కుట్రలని చూస్తే మహాభారతంలో శకుని కూడానా షాకైపోతాడు.. మాటలు రానోళ్లే స్పీచులు ఇస్తారు అంటూ ఈ పాటలో లిరిక్స్ వినిపిస్తున్నాయి.  

కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు కూడా ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వలేదు. తనని ఈ చిత్రంలో కించపరిచేలా చూపించారంటూ కేఏ పాల్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న టైటిల్ మార్చాల్సిందే అన్ని హైకోర్టు సెన్సార్ బోర్డుకు సూచించింది. దీనితో ఈ చిత్రం టైటిల్ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. వర్మ ఆల్రెడీ సెకండ్ టైటిల్ సెట్ చేసి ఉంచుకున్నాడు. కోర్టు ఆదేశిస్తే ఈ చిత్రానికి అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని టైటిల్ మారుస్తానని ప్రకటించాడు.