ఇటీవల వర్మ ఎక్కువగా వివాదాస్పద అంశాలనే తన సినిమా కథలుగా ఎంచుకుంటున్నాడు. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, రక్త చరిత్ర లాంటి చిత్రాలని వర్మ తెరక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని తెరకెక్కిస్తూ కొందరు రాజకీయ నాయకులపై సెటైర్లు వేయబోతున్నాడు. 

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ జగన్ ని హైలైట్ చేస్తూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించేలా ఈ చిత్రం ఉండబోతోంది. బెజవాడ రౌడీయిజంపై కూడా వర్మ ఫోకస్ పెట్టాడు. 

ఇదిలా ఉండగా ట్రైలర్ లో చంద్రబాబుని పోలి ఉన్న పాత్ర తన కుమారుడికి ప్లేట్ లో పప్పు వడ్డించే సన్నివేశం ఉంది. ఈ సీన్ తీవ్ర వివాదంగా మారుతోంది. ఓ ఇంటర్వ్యూలో వర్మ దీనిపై వివరణ ఇచ్చాడు. చంద్రబాబు, లోకేష్ ని టార్గెట్ చేయడం కోసమే పప్పు సీన్ పెట్టారా అని ప్రశ్నించగా.. అసలు ఈ చిత్రంలో చంద్రబాబు, లోకేష్ పాత్రలు ఉన్నాయని ఎవరు చెప్పారు అని ఆర్జీవీ ప్రశ్నించాడు. 

ఈ చిత్రంలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్లు మీకు మీరే ఊహించుకుంటే నేనేమి చేయలేను అని బదులిచ్చాడు. అయినా ఒక తండ్రి తన కొడుకుకి భోజనం వడ్డిస్తే అది కించపరిచినట్లు ఎలా అవుతుంది. నా చిత్రంలో చంద్రబాబు, లోకేష్ పాత్రలు లేవు. మాజీ ముఖ్యమంత్రి తనయుడిని సోషల్ మీడియాలో పప్పు పేరుతో ట్రోల్ చేయడం మీకు తెలియదా అని ప్రశ్నించగా.. నాకు తెలియదు అని వర్మ సమాధానం ఇచ్చాడు. 

ఆ సన్నివేశంలో నా ముఖ్య ఉద్దేశం ఓ తండ్రి కొడుకుపై చూపించే ప్రేమ మాత్రమే. మనం తినే భోజనంలో పప్పు కూడా ఉంటుంది. ప్రతి ఇంట్లో పప్పు ఉంటుంది. అందులో తప్పు ఏంటి అని వర్మ తనదైన శైలిలో వెటకారంగా బదులిచ్చాడు.