రీ ఎంట్రీలో ఫుల్‌ ఫాంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో 20 నిమిషాల పాటు కనిపించే కీలక పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చరణ్ సన్నివేశాలు కూడా షూట్ చేయాల్సి ఉండగా ఆర్‌ఆర్‌ఆఱ్‌ షూటింగ్ ఆలస్య అయిన కారణంగా ఆచార్య షూటింగ్ కూడా వాయిదా పడింది.

ప్రస్తుతం కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా అన్ని సినిమాల షూటింగ్ లు నిలిచిపోయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఖాళీగా ఉన్న చిరు తదుపరి చిత్రాలను లైన్‌లో పట్టే పనిలో ఉన్నాడు. లూసీఫర్‌ రీమేక్‌ను ఓకే చేశాడు చిరు.  ఈ సినిమాకు సాహో ఫేం సుజిత్‌ దర్శకుడు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ వైరల్ అవుతోంది.

మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన లూసీఫర్‌ సినిమాకు యంగ్ హీరో పృథ్దీరాజ్‌ సుకుమార్‌ దర్శకుడు. అంతేకాదు సినిమాలో కీలక సందర్భంలో ఓ అతిథి పాత్రలో తానే స్వయంగా నటించాడు పృథ్వీరాజ్‌. అయితే తెలుగు ఆ పాత్రను రామ్ చరణ్‌ పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాతోపాటు హరీష్ శంకర్‌, బాబీ, మెహర్‌ రమేష్ లాంటి దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా ఇటీవల వెల్లడించాడు చిరు.