మెగాస్టార్ చిరంజీవి తన నట జీవితంలో ఎందరో అభిమానులని సొంతం చేసుకున్నారు. ప్రతి పట్టణంలో చిరంజీవి అభిమాన సంఘాలు ఉన్నాయి. అంతటి అభిమానాన్ని చిరంజీవి సొంతం చేసుకున్నారు. చిరంజీవి సెట్ చేసిన ఈ ఫ్లాట్ ఫామ్ ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతోంది. అందుకే రాంచరణ్ సహా మెగా హీరోలంతా తమకు నాన్నగారు పూలబాట వేశారని అంటుంటారు. 

ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా ఉన్న నూర్ మహమ్మద్ మృతి చెందారు. అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ నూర్ మహమ్మద్ ఆదివారం రోజు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ చిరంజీవి యువత సంఘానికి నూర్ మహమ్మద్ అధ్యక్షడిగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ, అభిమానులు అతడిని నూర్ భాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. 

నూర్ మహమ్మద్ మృతి చెందడంతో మెగా ఫ్యామిలీ మొత్తం తీవ్ర విషాదం నెలకొంది. మెగా ఫ్యాన్స్  ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చారు. 

దశాబ్దాల కాలంగా నూర్ మహమ్మద్ మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉండేవారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన కార్యక్రమంలో హైదరాబాద్ లో ఏది జరిగినా నూర్ మహమ్మద్ ముందుండేవారు. ఆయన మృతితో మెగా అభిమానులు నూర్ మహమ్మద్ మెగాహీరోలతో కలసి దిగిన ఫోటోలని షేర్ చేస్తూ ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నారు. 

చిరంజీవి మొదలుకుని పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్, వరుణ్ ఇలా మెగా హీరోలందరితో నూర్ మహమ్మద్ సన్నిహితంగా ఉండేవారు. వీరాభిమాని మృతితో మెగా హీరోలు తమ కార్యక్రమాలని కూడా వాయిదా వేసుకుంటున్నారు. నేడు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర టీజర్ కు సంబంధించిన అప్డేట్ ప్రకటించాల్సి ఉంది. కానీ అభిమాని మృతి చెందిన సందర్భంగా టీజర్ అప్డేట్ వాయిదా వేస్తున్నట్లు గీతా ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది.