దీపావళి సందర్భంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ మీడియాతో ముచ్చటించారు. పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న చరణ్ అనేక విషయాలని పంచుకున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరక్కించిన చిత్రం సైరా. నాన్నగారు ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. కానీ ఉయ్యాలవాడ లాంటి విప్లవవీరుడి కథలో నటించడం.. ఆ చిత్రానికి నేను నిర్మాతని కావడం చాలా సంతృప్తిని ఇచ్చిందని చరణ్ పేర్కొన్నాడు. 

సైరా చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశం గురించి రాంచరణ్ మాట్లాడాడు. క్లైమాక్స్ లో నాన్నగారిని ఉరి తీసే సన్నివేశం చూడలేకపోయాను. తలతెగి ఉన్న ఆ సీన్ చూసి నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఆ సన్నివేశం ప్రేక్షకులకు ఎలా చూపించాలని దాదాపు 2 నెలల పాటు ఆలోచించినట్లు రాంచరణ్ తెలిపాడు. 

ప్రస్తుతం తాను నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదల వాయిదా పడ్డట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రాంచరణ్ తేల్చేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ అనుకున్న ప్రకారం జరుగుతోందని రాంచరణ్ తెలిపాడు. 

పవన్ కళ్యాణ్ కళ్యాణ్ రీ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలపై రాంచరణ్ స్పందించాడు. పవన్ కళ్యాణ్ మీ నిర్మాణంలో సినిమా చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పవన్ బాబాయ్ ప్రస్తుతం ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. కానీ కొన్ని  కథలు మాత్రం వింటున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. 

నేను బాబాయ్ తో సినిమా చేయడం కంటే.. ఆయన నిర్మాణంలో నటించడం అంటేనే ఇష్టం అని రాంచరణ్ తెలిపాడు. అకీరా నందన్ డెబ్యూ మూవీ కొణిదెల ప్రొడెక్షన్స్ బ్యానర్ లోనే ఉంటుందని వస్తున్న ఊహాగానాలపై కూడా రాంచరణ్ స్పందించాడు. ఈ విషయంలో నాకు, బాబాయ్ కి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. 

ఒకవేళ నిజంగానే అకీరాని మా బ్యానర్ లో పరిచయం చేయాల్సి వస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు అని చరణ్ అభిప్రాయపడ్డాడు.