శుక్రవారం మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్ తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. ప్రతీ ఏడే అభిమానులు చరణ్ బర్త్ డే వేడుకులను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి పరిస్థితుల దృష్ట్యా అభిమానులతో పాటు చరణ్ కూడా వేడుకలకు దూరంగా ఉంటున్నాడు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

`బ్రో రామ్ చరణ్‌. ఈ ఏడాది నీ పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తానని భావించాను. కానీ ప్రస్తుతం మనం లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో ఉన్నాం. ప్రస్తుతం అందరం ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో నీకు నేను రేపు ఉదయం 10 గంటలకు ఓ డిజిటల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము, ఈ సర్‌ప్రైజ్‌ నువ్వు ఎప్పటికీ మరచిపోలేవు` అంటూ కామెంట్ చేశాడు తారక్‌.

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలోని చరణ్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్ రిలీజ్ అవుతుందని చాలా రోజులు ప్రచారం జరుగుతుంది. దీంతో రేపు రిలీజ్ కాబోయేది రామ్ చరణ్‌ ఫస్ట్ లుక్‌ పోస్టరే అన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్‌ లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు.

చరణ్‌కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్‌కు జోడిగా ఒలివియా మోరిస్ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 400 కోట్ల బడ్జెట్‌ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నాడు.