సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలైవా అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్నారు రజినీకాంత్.

త్వరలోనే ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రానున్నారు. ప్రస్తుతం రజినీకాంత్.. మురుగాదాస్ దర్శకత్వంలో 'దర్బార్' సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా.. రజినీకాంత్ కి అరుదైన గౌరవం దక్కింది.  

ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా 2019 అవార్డ్స్‌లో 'ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ' అవార్డ్‌తో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ను స‌త్క‌రించ‌నున్న‌ట్లు కేంద్ర స‌మాచార ప్ర‌సారశాఖ  మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేవ‌క‌ర్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు.

కొన్ని దశాబ్దాలుగా తన నటనతో ఇండియన్ సినిమాకు రజినీకాంత్ చేసిన సేవలకు గాను ఈ అవార్డు ను ప్రకటించడం చాలా ఆనందంగా  ఉందని ఈ సందర్భంగా ప్రకాష్ జవదేకర్ తెలిపారు. నవంబ‌ర్ 20 నుండి 28 వ‌ర‌కు గోవాలో ఈ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేష‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

వివిధ దేశాల‌కు చెందిన 250 సినిమాల‌ను ఈ వేడుక‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అలానే ఈ ఫిలిం ఫెస్టివల్ లో యాభై మంది విమెన్ డైరెక్టర్స్ రూపొందించిన  యాభై సినిమాలను స్క్రీన్ చేయనున్నారు.