సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలైవా అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే రజినీకాంత్ బయటఎక్కడైనా కనిపిస్తే ఇక అంతే.. తమ అభిమాన నటుడితో ఒక్క ఫోటో దిగినా చాలని తెగ ట్రై చేస్తుంటారు. తాజాగా రజినీకాంత్ కి చెన్నై ఎయిర్ పోర్ట్ లో గ్రాండ్ వెల్కం దక్కింది. శుక్రవారం అర్ధరాత్రి రజినీకాంత్ చెన్నై ఎయిర్ పోర్ట్ కి వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులంతా అక్కడకి చేరుకున్నారు.

ట్విట్టర్ లో #WelcomeBackThalaiva అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ అయ్యేలా చేశారు. తలైవాతో ఫోటోలు దిగడానికి అభిమానులు చాలా మంది ప్రయత్నించారు. ఎయిర్ పోర్ట్ నుండి రజినీకాంత్ ని బయటకి తీసుకువెళ్లడం చాలా కష్టమైంది. ఎలాగోలా అభిమానుల నుండి తప్పించుకొని ఇంటికి బయలుదేరారు రజినీకాంత్.

అయితే ఓ అభిమాని మాత్రం అతడిని ఫాలో అవుతూనే ఉన్నారట. రజినీకాంత్ ఇంటి వరకు వెళ్లి బయటే నిచున్నాడట. ఇంతలో ఇంటి వాచ్ మెన్ వచ్చి రజినీకాంత్ పిలుస్తున్నారని అభిమానికి చెప్పగా.. అతడు వెంటనే తలైవా దగ్గరకి వెళ్లాడట. సదరు అభిమానిని ఇంటి లోపాలకి ఆహ్వానించిన రజినీకాంత్.. బైక్ మీద ఇంత దూరం ఫాలో చేసుకుంటూ రావడం సేఫ్ కాదని చెప్పారట.

దీంతో ఆ అభిమాని రజినీకాంత్ కి క్షమాపణలు చెప్పాడట. ఆ తరువాత రజినీకాంత్ అతడితో కలిసి ఫోటో తీసుకున్నాడు. ఈ స్టోరీ రజినీకాంత్ ఫ్యాన్స్ వర్గాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రజినీకాంత్ 'దర్బార్' సినిమాలో నటిస్తున్నాడు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా కనిపించనుంది.