సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. రజనీ పార్టీ పేరు, గుర్తు, సిద్ధాంతాలు అంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.

కొద్దిరోజుల క్రితం ఆయన పార్టీ పేరు ‘మక్కల్‌ సేవై కట్చి’ అంటూ వదంతులు వ్యాపించాయి. అలాగే సదరు పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించిందని ప్రచారం సాగింది.

దీనికి బలం చేకూరుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనలో కొత్త పార్టీలను రిజిస్టర్‌ చేసుకున్నవారికి పలు చిహ్నాలు కేటాయించింది. ఈ లిస్ట్‌లో చివరన మక్కల్‌ సేవై కట్చి అనే పార్టీకి ఆటో గుర్తు ఉండటంతో పుకారు రాయుళ్లు రెచ్చిపోయారు.

దీంతో రజనీ అభిమానులంతా తమ అభిమాన నాయకుడు పార్టీ పేరును ‘మక్కల్‌ సేవై కట్చి’ అంటూ దానిని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేశారు. అంతేకాకుండా ఆటో గుర్తును కేటాయించడం పార్టీకి అదనపు బలమని భావించారు. 

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రజనీ మక్కల్‌ మండ్రం నేత వీఎన్‌ సుధాకర్‌ ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ఓ ప్రకటన జారీ చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ జారీ చేసిన ప్రకటనలో పార్టీ పేరును చూసి రజనీ మక్కల్‌ మండ్రం రిజిస్టర్‌ చేసిన పార్టీ అదేనని భావిస్తూ ప్రసారమాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయిన్నారు.

అయితే రజనీ మక్కల్‌ మండ్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ అభిమానులు, మక్కల్‌ మండ్రం నేతలు ఓర్పు వహించాలని సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు