ప్రముఖ సినీ నటుడు రాజీవ్‌ కనకాల సోదరి, సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల కూతురు శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ప్రాణాంతక వ్యాధితో సుధీర్ఘ కాలం పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించాల్సి ఉంది. శ్రీ లక్ష్మీ ప్రముఖ టెలివిజన్‌ యాంకర్‌ సుమ కనకాలకు ఆడపడుచు అన్న విషయం తెలిసిందే.

ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల దేవదాస్ కనకాల కూడా మృతి చెందారు. కొద్ది కాలానికే శ్రీ లక్ష్మీ కూడా మరణించటంతో రాజీవ్ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీ లక్ష్మీ భర్త పెద్ది రామారావు ప్రముఖ జర్నలిస్ట్‌, ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన ఓఎస్‌డీగా కూడా పనిచేశారు.సినీ, టెలివిజన్‌ నేపథ్యం ఉన్నకుటుంబం నుంచి వచ్చిన శ్రీ లక్ష్మీ పలు టీవీ సీరియల్స్‌ లో కీలక పాత్రల్లో నటించారు. చిన్న తనంలో నటన పట్ల ఆసక్తి లేకపోయినా తండ్రి దర్శకత్వంలో వచ్చిన సీరియల్స్‌ ద్వారా ఆమె ఈ రంగంలోకి అడుగుపెట్టారు. తరువాత పూర్తిగా నటన మీదే దృష్టి పెట్టారు.

దూరదర్శన్‌ లో ప్రసారమైన రాజశేఖర చరిత్ర సీరియల్‌తో ఆమె తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చారు. ఎంఏ పూర్తి చేసిన తరువాత స్కూల్‌ టీచర్‌గా పనిచేసిన ఆమె ఆ సమయంలోనే నటిగా మారారు. దూరదర్శన్‌లోనే ప్రసారమైన స్వయంవరం సీరియల్‌లోనూ కీలక పాత్రల్లో నటించారు. చిన్నారి, కొత్త బంగారం, అరుంధతి, స్వాతి, ఆకాశగంగ, అగ్నిపూలు లాంటి సూపర్‌ హిట్ సీరియల్స్‌ లో నటించారు. అంతేకాదు ఓ కన్నడ షార్ట్‌ ఫిలింతో పాటు ఓ హిందీ సినిమాలోనూ ఆమె నటించారు.