ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చేయాల్సిన నష్టం చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కోల్పోయారు. ప్రజలు, ప్రభుత్వాలు, వ్యాపార రంగం, ఇతర రంగాలన్నీ ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోయి. ఇంతజరిగినా కరోనా విజృంభణ తగ్గడం లేదు. 

సినిమా రంగం తలాకుతలం అవుతోంది. కరోనా ప్రభావంతో అన్ని చిత్రాల షూటింగ్స్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్శకధీరుడు రాజమౌళి దాదాపు 400 కోట్ల వ్యయంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా కనీసం ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి నెలకొంది. 

ముందుగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జూలై 31, 2020లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ జోరుగా సాగకపోవడంతో 2021 సంక్రాంతికి రిలీజ్ వాయిదా వేశారు. ఈలోగా కరోనా వచ్చి పడింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా షూటింగ్ వాయిదా పడింది. 

ఇటీవల నిర్మాత దానయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడం అసాధ్యం అని తేల్చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. తాజా సమాచారం మేరకు మరోమారు ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. 

ఈసారి చిత్ర యూనిట్ ఏకంగా 2022 సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈలోగా పరిస్థితులు చక్కబడి రిలీజ్ కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారట. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంత లాంగ్ డిలే కావడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎక్కువ నష్టం అనే వాదన వినిపిస్తోంది. 

ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం అరవింద సమేత 2018లో విడుదలయింది. ఒక వేళ ఆర్ఆర్ఆర్ 2022లోనే విడుదలైతే ఎన్టీఆర్ క్యాలెండర్ లో 2019, 20, 21 వరుసగా మూడేళ్లు ఖాళీ అయినట్లు అవుతుంది. రామ్ చరణ్ మాత్రం చిరంజీవి ఆచార్య చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.