అనుకున్నదే జరిగింది.. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ చిత్రం అధికారికంగా వాయిదా పడింది. షూటింగ్ లో జరుగుతున్న ఆలస్యం కారణంగా ఆర్ఆర్ఆర్ చిత్రం దసరాకు కానీ, వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ వాయిదా పడబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 

కానీ చిత్ర యూనిట్ మాత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. అనుకున్న సమయానికే వస్తామని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాయిదా వేయక తప్పలేదు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వాయిదా వేయడానికి గల కారణాలు వివరిస్తూ చిత్ర యూనిట్ కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది. 

2021, జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ' 24 గంటల పాటు తాము బిజీ షెడ్యూల్ లో కష్టపడుతున్నాం. అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని మీకు అందించాలని అనుకుంటున్నాం. మేము ఎంతగా కష్టపడుతున్నప్పటికీ.. మీ ప్రేమ అభిమానుల వల్ల ఆ కష్టాన్ని మరిచిపోతున్నా. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాల్సి ఉంది. కాబట్టి వాయిదా వేయక తప్పడం లేదు. 

ఇది మీకు నిరాశ కలిగించే అంశమే.. కానీ మీకు అద్భుతమైన చిత్రాన్ని అందించడానికి మాకు మరికొంత సమయం కావాలి. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జనవరి 8, 2021న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ గ్యాప్ లో మీకు అనేక విశేషాలు తెలియజేస్తూ ఉంటాం' అని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

ముందుగా ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయాలని భావించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డివివి దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తనకు వచ్చిన ఓ ఆలోచనకు కల్పితాన్ని జోడించి విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవ్ గన్, ఒలీవియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.