యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య విభేదాలంటే కాస్త ఆశ్చర్యాన్ని, అభిమానులకు కలవరపాటుని కలిగించే అంశమే. ఎన్టీఆర్, చరణ్ కలసి ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. 

ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు వీరుల పాత్రల్లో టాలీవుడ్ సూపర్ స్టార్స్ నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అల్లూరి, కొమరం భీం యుక్తవయసులో దాదాపు ఒకే సారి అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిద్దరికి చరిత్రలో ఎలాంటి సంబంధం లేదు. 

కానీ రాజమౌళి ఈ చిత్రాన్ని కల్పితగాధగా చిత్రీకరిస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళాక వీరిద్దరూ స్నేహితులైతే ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 1920 కాలం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో ఈ చిత్రం ఉంటుంది. బ్రిటిష్ వారితో చరణ్, ఎన్టీఆర్ చేసే పోరాటాల కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. 

బాపూ బొమ్మని మించిన అందం.. పట్టుపరికిణిలో మెరుస్తున్న జాన్వీ

తాజాగా ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లూరి, కొమరం భీం మధ్య విభేదాలు తలెత్తే సీన్ ఉంటుందట. ఈ సన్నివేశంలో చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ కూడా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. 

రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఎలాంటి సమాచారం బయట పెట్టకుండా సీక్రెట్ మైంటైన్ చేస్తున్నాడు. అప్పుడప్పుడూ వస్తున్న లీకులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.