దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాహుబలి లాంటి చారిత్రాత్మక విజయం తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

నటీనటుల వివరాలు, కథ గురించి కొన్ని విశేషాలు తప్ప రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కనీసం టైటిల్ గురించి కూడా పూర్తిగా క్లారిటీ లేదు. అన్ని భాషల్లో ఈ చిత్రానికి 'RRR' అనేది కామన్ టైటిల్ గా ఉంటుందని రాజమౌళి ప్రకటించారు.  RRR కు పూర్తి అర్థాన్ని ఇచ్చే టైటిల్స్ ఒక్కో భాషలో ఒక్కో విధంగా ఉండబోతోందని కూడా రాజమౌళి తెలిపారు. 

RRR కు పూర్తి అర్థాన్నిచ్చేలా టైటిల్స్ పంపమని అభిమానులని కోరగా అన్ని భాషల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ఎక్కువగా 'రామ రావణ రాజ్యం' అనే టైటిల్ వినిపించింది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇదే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ 'రామ రావణ రాజ్యం' టైటిల్  RRR చిత్రానికి దక్కే అవకాశం లేకుండా పోయింది. 

ఈ టైటిల్ ని వి3 ఫిలిమ్స్ సంస్థ రిజిస్టర్ చేయించుకుంది. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మరో టైటిల్ ని ఆలోచించుకోవలసిందే. రామ రావణ రాజ్యం సౌండింగ్ బావుండడంతో వి 3 సంస్థ ఈ టైటిల్ ని దక్కించుకుంది. 

1920 కాలానికి సంబంధించి బ్రిటిష్ పరిపాలన నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 

డివివి దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్ రాంచరణ్ కు హీరోయిన్ గా, ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ఎంపికయ్యారు. రే స్టీవెన్సన్, అలిసన్ డూడి విలన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం.