బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా దేశ విదేశీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్‌ భామ ఒలివియా మోరిస్‌ నటిస్తుండగా, రామ్ చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన 2021 జనవరి 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ లకు బ్రేక్‌ పడటంతో అనుకున్న సమయానికి రిలీజ్ చేయటం కష్టమని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాలో అలియా పాత్రపై దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. కీలకమైన సీత పాత్రకు అలియా భట్‌ను ఎందుకు ఎపింక చేశారో వివరించాడు. సీత పాత్ర సినిమాలో ఎంతో కీలకమన్న జక్కన్న ఆ పాత్రకు ఎన్టీఆర్‌, రామ్ చరణ్ లతో పోటి పడి నటించే అమ్మాయి కావాలి. సీత పాత్రలో అమాయకత్వం, తిరుగుబాటు, హుషారు ఇలా అన్ని రకాల భావాలు పలికించాలి. అందుకోసం గొప్ప నటి కావాలి. అలియా అలాంటి గొప్ప నటి అందుకే ఆమెను ఎంచుకున్నామని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు మీడియా ప్రచారం అవుతున్నట్టుగా ఇది ట్రయాంగులర్‌ లవ్‌ స్టోరి కాదని తెలిపాడు రాజమౌళి.