కేటీఆర్ దగ్గర పంచాయితీ పెట్టిన రాహుల్ సిప్లిగంజ్
బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బుధవారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులతో కలసి గచ్చిబౌలిలోని ఓ పబ్బుకు వెళ్ళాడు.
బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బుధవారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులతో కలసి గచ్చిబౌలిలోని ఓ పబ్బుకు వెళ్ళాడు. తనతో వచ్చిన స్నేహితురాళ్ళతో అక్కడ ఉన్న కొందరు అసభ్యంగా ప్రవర్తించారని, అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనపై బీరు బాటిల్స్ తో దాడికి దిగారని రాహుల్ మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే.
రాహుల్ పై దాడి చేసిన వారిలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోదరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో రాహుల్ పబ్బులో వీడియో ఫుటేజ్ సహా అన్ని ఆధారాలతో వారిపై కేసు నమోదు చేశాడు. తనపై దాడి చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని రాహుల్ సిప్లిగంజ్ డిమాండ్ చేస్తున్నాడు.
తాజాగా రాహుల్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ని సోషల్ మీడియా వేదికగా రిక్వస్ట్ చేశాడు. ఈ సందర్భంగా రాహుల్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. పబ్బులో తనపై దాడి జరిగిన వీడియోతో సహా కేటీఆర్ కు ట్యాగ్ చేశాడు. కేటీఆర్ సర్ ఈ వీడియో చూడండి. ఆ గ్యాంగ్ నాపై ఎలా దాడి చేశారో చూడండి. ఈ వీడియో చూశాక న్యాయం ఎవరివైపున ఉంటే వాళ్ళ తరుపున మాట్లాడండి.
నేను కూడా టిఆర్ఎస్ పార్టీ మద్దతుదారుడనే. టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేశాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది తెలంగాణ గడ్డపైనే. తెలంగాణ కోసం నేను బతికున్నవరకు నాకు చేతనైన సేవ చేస్తూనే ఉంటా. ఎమ్మెల్యే సోదరుడు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేయడం, దాడులు చేయడానికి ఉపయోగించడం తగదు. మీరు తీసుకునే చర్యల కోసం ఎదురుచూస్తున్నా అని రాహుల్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.
రాహుల్ కి మద్దతుగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హిమజ, అషు రెడ్డి కూడా కామెంట్స్ చేసారు. వి వాంట్ జస్టిస్ అని రాహుల్ పోస్ట్ కి రిప్లై ఇచ్చారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందింస్తారో చూడాలి.