అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి అనే మాట అందరూ చెప్పేదే. కానీ దాన్ని పాటించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం లారెన్స్ ఆ మాటకు కరెక్ట్ గా సెట్టవుతాడు. సాయం చేసే గుణంలో సినిమా ఇండస్ట్రీలో  నిజమైన సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని ఎప్పుడో అందుకున్న లారెన్స్ మరోసారి తన మంచి గుణాన్ని చూపించాడు.

ఇటీవల హైదరాబాద్ కి చెందిన ఒక యువకుడు లారెన్స్ ని సోషల్ మీడియా ద్వారా జాబ్ కావాలని కోరగా లారెన్స్ వెంటనే స్పందించాడు. రెండు చేతులు లేని తనకి ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదని చెబుతూ.. శివ కుమార్ అనే యువకుడు లారెన్స్ ని ట్యాగ్ చేస్తూ ఏదైనా జాబ్ ఇప్పించాల్సిందిగా కోరాడు. తనకు కంప్యూటర్ టైపింగ్ వచ్చని చెప్పడంతో లారెన్స్ హైదరాబద్ లోని తన సేవా సంస్థలో జాబ్ ఇప్పించాడు.

అతనితో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసిన లారెన్స్ ఇక నుంచి హైదరాబద్ లో అతను తన సేవ కార్యక్రమాలను నడిపిస్తాడని ఇతరుల బాద తెలిసిన శివకు పూర్తి బాధ్యతలను ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదివరకే ఎంతో మందికి సాయపడిన లారెన్స్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు.