బాహుబలి చిత్రంతో అనుష్క దేవసేనగా దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. బాహుబలిలో అనుష్క నటనకు ప్రశంసలు దక్కాయి. బాహుబలి లాంటి భారీ విజయం తర్వాత అనుష్క వరుసగా చిత్రాలు చేస్తుందని భావించారు. కానీ అనుష్క ఇటీవల బాగా జోరు తగ్గించింది. 

బాహుబలి తర్వాత అనుష్క నటించిన ఒకే ఒక్క చిత్రం భాగమతి. ఇటీవల విడుదలైన సైరాలో చిన్న పాత్రలో మెరిసింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరక్కుతున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు. 

కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొనిఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. 

నవంబర్ 6న సాయంత్రం 5 గంటలకు నిశ్శబ్దం చిత్ర టీజర్ రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ చేతులమీదుగా టీజర్ లాంచ్ కానుండడం విశేషం. అనుష్క హీరోయిన్ గా కమర్షియల్ చిత్రాల్లో అదరగొట్టింది. అదే విధంగా అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా తన సత్తా చాటింది. 

దీనితో నిశ్శబ్దం మూవీపై అందరి దృష్టి నెలకొని ఉంది. అనుష్క ఈ చిత్రంతో ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.