పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న PSPK26 చిత్ర ఫస్ట్ లుక్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఈ చిత్రానికి 'వకీల్ సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పవన్ కళ్యాణ్ స్టైలిష్ ఫోజులో పడుకుని పుస్తకం చదువుతున్న లుక్ ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ హెయిర్ స్టయిల్, మేనరిజమ్స్ తో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఫస్ట్ లుక్ ఉంది. చిందరవందరగా పడి ఉన్న కుర్చీల మధ్య పవన్ పడుకుని ఉన్నాడు. 

ఫస్ట్ లుక్ రిలీజ్ కు కొన్ని గంటల ముందు నుంచే సోషల్ మీడియాలో అభిమానులు హంగామా మొదలు పెట్టారు. ఇక దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ ముందు పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. నృత్యాలు చేస్తూ, బాణాసంచా కాల్చుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బోనికపూర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అంజలి, నివేత థామస్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం. ఫస్ట్ లుక్ తో మొదలైన సందడి ఈ చిత్ర విడుదల వరకు కొనసాగనుంది. త్వరలో ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నారు.