కరోనా సినీ రంగం మీద దారుణంగా ప్రభావం చూపించింది. ఈ మహమ్మారి కారణంగా వేల మంది సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో వందలాది సినిమాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌ కాకుండా ఆగిపోయాయి. తిరిగి పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో ఇప్పట్లో చెప్పే పరిస్థితి లేదు. దీంతో కొంత మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ లిస్ట్ కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య కూడా చేరిపోయాడు. జ్యోతిక ప్రధాన పాత్రలో తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించిన సినిమా `పొన్‌ మగల్‌ వందాల్‌`. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో సూర్య ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే సూర్య నిర్ణయం పై థియేటర్ల యాజమాన్యాలు ఫైర్‌ అయ్యారు. ఒక వేళ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే తరువాత  ఆ బ్యానర్‌లో రిలీజ్‌ అయ్యే అన్ని సినిమాలను ఇక థియేటర్లలో ప్రదర్శించబోమని చెప్పారు.

దీంతో సూర్య ఆలోచనలో పడ్డాడు. అయితే ఈ విషయంలో తమిళ నిర్మాతలు సూర్యకు మద్దతుగా నిలిచారు. దాదాపు 30 మంది నిర్మాతలు సూర్యకు మద్దతుగా నిలిచారు. ఈ కష్టకాలంలో చిన్న సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయటం ద్వారా నిర్మాతలు సేఫ్‌ అవుతారని తెలిపారు. అయితే ఈ వివాదం పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినా.. పెను మార్పులుమాత్రం గ్యారెంటీ అని తెలుస్తోంది.