సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా మీకు మాత్రమే చెప్తా. మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమాతో పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా, షామీర్‌ సుల్తాన్‌ను దర్శకుడిగా పరిచయం అయ్యారు.విజయ్ నిర్మాత కావటంతో పాటు పబ్లిసిటీలోనూ విజయ్‌ ఇచ్చిన  స్టేట్‌మెంట్స్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ అయ్యాక అంత సీన్ లేదని తేలిపోయింది. చాలా చోట్ల ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే వీకెండ్ లో ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్లతో మల్టిఫ్లెక్స్ లు ఫిల్ అవుతున్నాయి.

సినిమాకు డివైడ్ టాక్ రావటంతో పాటు, సినిమా నిర్మాణం మరీ నాశిరకంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. క్వాలిటీ చూసుకోకుండా షార్ట్ ఫిలింలా చుట్టేసారని అన్నారు. ఈ నేపధ్యంలో ఈ కామెంట్స్ పై  విజయ్‌ దేవరకొండ తండ్రి వర్థన్‌ దేవరకొండ స్పందించారు.
 
వర్ధన్ మాట్లాడుతూ... `మీకు మాత్రమే చెప్తా సినిమాకు  మేము ఖర్చు పెట్టలేదన్న విమర్శల్లో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమాకు దాదాపు ఐదున్నర కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసాం. అందులో కోటి రూపాయలు రెమ్యూనరేషన్లకే అయ్యింది. దాదాపు కోటి 25 లక్షల రూపాయిలు ప్రమోషన్ల కోసమే ఖర్చు పెట్టాం. అయితే సినిమా డీఐలో బ్రౌన్‌ టింట్‌ కారణంగా తెర మీద క్వాలిటీ కనిపించలేదు. దానికి తోడు మేము చాలా షూట్ చేసాం. అయితే లెంగ్త్  పెరుగుతుందని కట్ చేసేసాం.  

అలాగే సినిమాలో ఎక్కువ భాగం నైట్స్  షూట్‌ చేయటం వల్ల కాల్షీట్స్‌ ఎక్కువయ్యాయి. ఎక్కువ భాగం ట్రావెల్‌లో షూట్‌ చేయటం వల్ల కూడా ఖర్చు పెరిగుతూపోయింది.  ఆరు నెలలో పూర్తి చేయాల్సిన సినిమా దాదాపు 18 నెలల టైమ్ తీసుకుంది. దాంతో బడ్జెట్‌ పెరిగింది`. అంటూ క్లారిటీ ఇచ్చారు.