చాలా గ్యాప్ త‌ర‌వాత ప్రియ‌మ‌ణి మ‌ళ్లీ తెర‌పై కొచ్చి  వరస సినిమాలు చేస్తోంది.  అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిల‌దొక్కుకోవ‌డం అంత ఈజీ టాస్క్ కాదు. యంగ్ తరంగ్ లతో  పోటీ ఎక్కువ‌గా ఉంది. దానికి తోడు హీరోయిన్ గా గ్లామ‌ర్ పాత్ర‌లు చేసే వ‌య‌సు దాటిపోయింది. అలాగని అక్క, అమ్మ పాత్రలు చేయలేదు.  లేడీ ఓరియెంటెడ్   చిత్రాలే ఎంచుకోవాలి. అయితే.. ఆ త‌ర‌హా క‌థ‌ల‌కు మెల్ల‌మెల్ల‌గా కాలం చెల్లిపోతోంది.

క‌థ‌లో విభిన్నత ఉంటే త‌ప్ప సినిమాలు చూడ‌డం లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు మార్కెట్ కూడా స‌రిగా ఉండ‌డం లేదు. దాంతో ఇప్పుడు ఆమె రీఎంట్రీ అంత గొప్పగా ఉంటుందనుకోవటం లేదు. ఈ నేపధ్యంలో ఆమె దగ్గరకు ఓ పాత్ర వచ్చింది. సినిమాలో సెకండ్ హీరోయిన్ లాంటి పాత్ర అది. ఆ పాత్రతో తన పేరు మరోసారి మారు మ్రోగుతుందని భావిస్తోంది. ఇంతకా ఏమిటా పాత్ర ..ఏ సినిమా అంటే....   దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ‘తలైవి’.

ఈ సినిమాలో ప్రియమణి..శశికళ పాత్రలో కనిపించబోతోంది. శశి కళ ..జయలలిత జీవితంలో ఎక్కవ ప్రభావం చేసిన వ్యక్తి. ఆమె జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి. దాంతో ఆ పాత్రను ఎలా డిజైన్ చేయబోతున్నారనే విషయం ఇప్పటికే తమిళనాట ఆసక్తికర విషయంగా ఉంది. దాంతో ఆ పాత్ర చేస్తున్న ప్రియమణి మీదా అందరి దృష్టీ పడుతుందటనటంలో సందేహం లేదు.  ‘తలైవి’ సినిమా కోసం దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ దాదాపు తొమ్మిది నెలలపాటు రీసెర్చ్ చేశారు. ఆమె జీవితం గురించి ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

జయలలితగా కంగన నటిస్తుండగా.. ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో ‘తలైవి’గా, హిందీలో ‘జయ’గా సినిమా విడుదల కాబోతోంది. కంగన ఇటీవల ‘మణికర్ణిక’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు.

వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది.  రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అమ్మ లుక్‌లో నటి కంగనా రనౌత్‌ ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో కనిపించారు. పచ్చచీరలో అభివాదం చేస్తున్న బ్యానర్‌ను ఈ ఫస్ట్ లుక్ లో చూపించారు.  ఈ పోస్టర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  వచ్చే ఏడాది జూన్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు యూనిట్‌ ఈ సందర్భంగా ప్రకటించింది. ‘ఈ లెజెండ్‌ మనందరికీ తెలుసు. కానీ ఆమె కథ అందరికీ ఇంకా చెప్పాల్సి ఉంది’ అని టీం పేర్కొంది.