ఈ మధ్య కాలంలో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకున్న క‌న్నడ చిత్రం కేజీఎఫ్‌. దాదాపు రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి అన్ని ఇండ‌స్ట్రీల‌కు షాక్ ఇచ్చిందీ చిత్రం. క‌ర్ణాటక రాష్ట్రంలో డబ్బైల్లో  జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్టర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఆ మధ్యన ఆడిషన్స్ చేసారు. అఫీషియల్ గా  ప్రకటన ఇచ్చి మరీ తీసుకున్నారు.

అయితే ఇప్పటికి ఆ సినిమాలో వేషం ఇప్పిస్తానంటూ ఈమెయిల్స్ పంపుతూ, డబ్బులు తీసుకుంటూ కొందరు మేసానికి పాల్పడుతున్నారు. ఈ విషయం దర్శకుడు దృష్టికి వచ్చింది.  దాంతో అలాంటివి నమ్మవద్దంటూ ప్రకటన చేసారు  ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ కి సంబంధించి ఎలాంటి ఆడిష‌న్స్ ఉన్నా కూడా హామ్‌బేల్ ఫిలింస్ నుండి మాత్రమే అఫీషియ‌ల్ ప్రక‌ట‌న వ‌స్తుంద‌ని స్పష్టం చేశారు ప్రశాంత్.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ ..అధీర్ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. ఆ మ‌ధ్య విడుదల చేసిన సంజ‌య్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 2020లో విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.  హోమ్‌బేల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని మించి యాక్షన్, మాఫియా ఉంటాయట. య‌శ్ ప్రధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్‌లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మర్‌లో చిత్ర విడుద‌ల‌కి ఏర్పాట్లు చేస్తున్నారు.