సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే ప్రకాష్ రాజ్ ఏదో ఒక పాత్రలో నటించాల్సిందే. ప్రకాష్ రాజ్ నటన అంత అద్భుతంగా ఆకట్టుకుంటుందని మహెష్ నమ్మకం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజైన మహేష్ చిత్రం సరిలేరు నీకెవ్వరులో కూడా ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. 

ఇటీవల కొంత కాలంగా ప్రకాష్ రాజ్ రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి విధానాలని విమర్శిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రకాష్ రాజ్, మహేష్ బాబు మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. దానిపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. అలాటిదేమీ లేదని అదంతా అసత్య ప్రచారం అని ఖండించారు. 

మా మధ్య విభేదాలు ఎందుకుంటాయి.. ఇటీవలే కదా.. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించా.. బ్రహ్మాండంగా ఆ సినిమా ఆడింది అని ప్రకాష్ రాజ్ అన్నారు. మహేష్ బాబుపై అలిగిన ప్రకాష్ రాజ్ సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ హాజరు కాలేదనే వార్తలపై కూడా ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. నేను ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి హాజరు కాను. అంతెందుకు సినిమాలు కూడా పెద్దగా చూడను. సరిలేరు నీకెవ్వరు కూడా ఇంతవరకు నేను చూడలేదు. అంతమాత్రాన మహేష్ తో విభేదాలు ఉన్నట్లా అని ప్రకాష్ రాజ్ అన్నారు. మహేష్ బాబు బంగారం అని అన్నారు. 

ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో పాల్గొనేంత ఓపిక నాకు ఉండదని ప్రకాష్ రాజ్ అన్నారు. నటుడిగా అవకాశాలు తగ్గడం వల్లే ప్రకాష్ రాజ్ ప్రస్తుతం రాజకీయ పరమైన కామెంట్స్ చేస్తూ, మోడీని తిడుతూ కుర్చున్నారనే ప్రశ్నకు ప్రకాష్ రాజ్ స్పదించారు. నాకు ఛాన్సుల్లేవంటే నవ్వుతారు. మహేష్ తో సినిమా చేశా, పవన్ కళ్యాణ్ తో చేస్తున్నా.. రజనీకాంత్ తో చేస్తున్నా, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో చేస్తున్నా. నా ఫ్యామిలీతో గడిపే సమయమే నాకు దొరకడం లేదు. అలాంటిది నాకు ఛాన్సులు లేకపోవడం ఏంటి అని ప్రకాష్ రాజ్ అన్నారు. 

ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తన రోల్ గురించి కూడా ప్రకాష్ రాజ్ అసంతృప్తి చెందారనే వార్తలు వచ్చాయి. ఇందులో అసంతృపి చెందడానికి ఏముంది.. అంతకంటే చిన్న వేషాలు వేసి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. సరిలేరు నీకెవ్వరులో నా పాత్రలో తప్పేముంది ? విలన్ గా ఉన్న వ్యక్తి చివర్లో కామెడీగా మారుతాడు.. అంత మాత్రానికి నేనెందుకు అసంతృప్తి చెందుతా. తన రోల్ ని ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.