బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజే మారిపోయింది. అప్పటి వరకు తెలుగు సినిమాకు మాత్రమే పరిమితమైన డార్లింగ్, ఆ తరువాత ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా మారిపోయాడు. బాహుబలి తొలి భాగం జాతీయ స్థాయిలో సూపర్‌ హిట్ కావటం తరువాత రెండో భాగం అంతర్జాతీయ స్థాయితో సత్తా చాటడంతో ప్రభాస్ రేంజే మారిపోయింది. అదే జోరులో తదుపరి చిత్రాన్ని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేశాడు ప్రభాస్.

రన్ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా లెవల్‌ లో సాహో సినిమాను రూపొందించాడు. యాక్షన్‌ ఎండ్వంచరస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సాహో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కమర్సియల్ గా మాత్రం సక్సెస్ అయ్యింది. దీంతో ప్రభాస్ తదుపరి చిత్రాలను కూడా పాన్‌ ఇండియా లెవల్‌ లో ప్లాన్ చేస్తున్నారు. సాహో తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్, జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కరోనా ఎఫెక్ట్‌ తో బ్రేక్‌ పడింది. ఇటీవల జార్జీయా షూటింగ్ అర్థాంతరంగా ముగించుకొని వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్నాడు. అయితే తిరిగి పరిస్థితులు చక్కబడిన తరువాతే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


ఇప్పటికే నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు ప్రభాస్. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్‌ హీరో పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అయ్యేది ఇంకా కన్ఫామ్‌ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా పూర్తయితేగాని నెక్ట్స్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు. దీంతో ప్రభాస్‌ ను సూపర్‌ హీరోగా చూడాలనుకుంటున్న అభిమానులు మరింత కాలం ఎదురుచూడక తప్పదు.