కరోనా వల్ల అన్ని ఇండస్ట్రీలు కుదేళయిపోయాయి. ఈ ప్రభావం సినీ రంగం మీద కూడా భారీగా ఉంది. షూటింగ్ పూర్తయిన సినిమాల రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. ప్రమోషన్ కార్యక్రమాల ప్రసక్తే లేదు. దీంతో నిర్మాతలు పెద్ద పెద్ద నటీనటులు, సాంకేతిక నిపుణులకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా రోజు వారీ కూలీ మీద బతికే సినీ కార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. రోజు పనిదొరికితేగాని పూట గడవని వారు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు.

వారిని ఆదుకునేందుకు సినీ పెద్దలు ముందుకు వచ్చారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలు చేరో కోటి రూపాయలు సినీ కార్మికుల సహాయార్థం ప్రకటించారు. అంతేకాదు సీ సీ సీ (కరోనా క్రైసిస్ చారిటీ) పేరుతో ఓ సంస్థను స్థాపించి దానికి ద్వారా కార్మికులకు సాయం అందిస్తున్నారు. సినీ పెద్దలు పూనుకోవటతో చారిటీకి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ముఖ్యంగా హీరోలు భారీ విరాళాలు అందిస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్ లోకి మరో ఇద్దరు టాప్ స్టార్లు చేరారు. కరోనా పై పోరాటానికి ఇప్పటికే 4 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభాస్ సినీ కార్మికుల కోసం 50 లక్షలు ప్రకటించాడు. మరో యంగ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా భారీ విరాళం ప్రకటించాడు. కరోనా పై పోరాటానికి కోటీ 25 లక్షలు ఇచ్చిన బన్నీ సినీ కార్మికుల కోసం 20 లక్షలు అందించనున్నాడు. వీరితో పాటు శర్వానంద్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్ తేజ్‌, విశ్వక్‌ సేన్‌, కార్తికేయ లాంటి హీరోలు కూడా తమ వంతు సాయం అందించారు.