ప్రస్తుతం సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రాల గురించి సినీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. కొదమసింహాల్లాంటి రెండు భారీ చిత్రాలు టాలీవుడ్ నుంచి సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రాలు వరుసగా జనవరి 11, 12 తేదీల్లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. 

ఇద్దరు హీరోలకు అభిమానుల్లో తిరుగులేని క్రేజ్ ఉంది. దీనితో ఎవరి సినిమా ఎవరికి ఎఫెక్ట్ అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. దీనితో వీలైనంతమేరకు బలమైన ఓపెనింగ్స్ పిండుకోవాలని రెండు చిత్రాల నిర్మాతలు భావిస్తున్నారు. దీనికోసం ప్రచారంలో ఏ చిన్న అంశాన్ని విడిచిపెట్టడం లేదు. 

సరిలేరు నీకెవ్వరు చిత్రం వరుస విజయాలు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరక్కుతుండగా.. అల వైకుంఠపురములో చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. సరిలేరు నీకెవ్వరు చిత్ర రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. 

ఈ అంశంలో కొంత వరకు మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు. అల్లు అర్జున్ సినిమా విడుదలవుతుండగా మహేష్ సినిమా ప్రచారం కోసం మెగాస్టార్ వెళుతుండడం ఫ్యాన్స్ కు పంటికింద రాయిలా మారింది. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురములో ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. 

ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చిత్ర యూనిట్ తేల్చాల్సి ఉంది. కానీ ఫ్యాన్స్ లో మాత్రం పవన్ అల వైకుంఠపురములో చిత్ర ప్రీరిలీజ్ కు హాజరు కావాలనే కోరిక బలంగా ఉంది. మరి తన మిత్రుడు పవన్ ని త్రివిక్రమ్ సంప్రదిస్తాడా లేదా వేచి చూడాలి.