చాలా రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు కొందరు సినీ దిల్ రాజు ప్రణాళికలు కూడా రచించారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం స్పందన రాలేదు. 

దీనితో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారా లేదా అనే అనుమానం కూడా నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా దిల్ రాజు పవన్ అభిమానులని ఖుషీ చేసే ప్రకటన చేశారు. పింక్ రీమేక్ కు సంబంధించిన మ్యూజిక్ కంపోజింగ్ ప్రారంభమైందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. 

ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ సంగీతం అందిస్తున్నాడు. వీరు ముగ్గురూ కలసి ఉన్న లేటెస్ట్ ఫోటోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న 40వ చిత్రం పింక్ రీమేక్. తమన్ అందించిన అద్భుతమైన ట్యూన్ తో ఈ చిత్రం ప్రారంభమైంది' అని ప్రకటించారు. 

కానీ ఈ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ పేరు మాత్రం లేదు. ఇదేంటంటూ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. బహుశా తన రీఎంట్రీ గురించి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటిస్తారేమో వేచి చూడాలి. ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ గా క్రేజీ బ్యూటీ నివేత థామస్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్రాన్ని ఇప్పటికే తమిళంలో రీమేక్ చేశారు. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించారు. పవన్ కళ్యాణ్ ని లాయర్ పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.