గబ్బర్ సింగ్.. ఈ పేరు వింటే పవన్ అభిమానులకు కొండంత సంతోషం. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న విజయ దాహాన్ని ఈ చిత్రం తీర్చింది. ఏళ్లతరబడి హిట్ లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ స్టామినా తగ్గలేదు.. గబ్బర్ సింగ్ విడుదలయ్యాక పవన్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. 

హరీష్ శంకర్ దర్శత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కించిన గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తయింది. దీనితో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం అఖండ విజయాన్ని అందుకుంది. 

ఈ చిత్రం విడుదలై 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని తెలియజేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అభిమానులతో పాటు బండ్ల గణేష్ కూడా చేతులు కలిపాడు. గబ్బర్ సింగ్ చిత్రం నాటి సంగతులని గుర్తు చేసుకున్నాడు. 

 

గబ్బర్ సింగ్ చిత్రంపై బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ చేశాడు. అందరూ పుట్టినరోజు నాడో పెళ్లి రోజు నాడో ఇంట్లో హోమం చేస్తారు. కానీ నేను మాత్రం గబ్బర్ సింగ్ విడుదల రోజు కుటుంబ సభ్యులతో కలసి ఇంట్లో హోమం చేశా అంటూ గణేష్ ఆ దృశ్యాలని అభిమానులతో పంచుకున్నాడు. 

తింటే గారెలే తినాలి.. తీస్తే గబ్బర్ సింగ్ లాంటి  సినిమా తీయాలి. ఇది నా అదృష్టం జై పవర్ స్టార్ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ఈ రోజుల్లో సాయం చేసిన వారినే  తిరిగి ప్రశ్నిస్తున్నారు. నేను మాత్రం మీకు జన్మంతా రుణపడి ఉంటాను అంటూ గణేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.