సౌత్ కొరియాకు చెందిన యంగ్ పాప్ సింగర్ సల్లి(25) అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పాతికేళ్ల వయసులోనే సల్లి సింగర్ గా, నటిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సౌత్ కొరియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సల్లి మృతదేహాన్ని మొదట ఆమె మేనేజర్ గమనించారట. 

11 ఏళ్ల బాల్యం నుంచే గాయనిగా సల్లి తన ప్రతిభ చాటుతూ వచ్చింది. ఆమె ఊహించని విధంగా మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో సల్లి ఆన్లైన్ లో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. 

సల్లి కె-పాప్ గ్రూప్ ఎఫ్ఎక్స్ లో మెంబర్ గా చాలా కాలం కొనసాగిన సంగతి తెలిసిందే. ట్రోలింగ్ తర్వాత సల్లి తన గ్రూప్ కు దూరమైంది. నటనపై దృష్టి పెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన స్నేహితులు, సొంతవారు కూడా నన్ను వదలిపెట్టి వెళ్లిపోయారు. 

ఆ సమయంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు సల్లి తెలిపింది. కానీ ఇంతలోనే ఆమె తన నివాసంలో మృతి చెందడం విషాదంగా మారింది. సల్లి మృతికి గల కారణాలని పోలీసులు అన్వేషిస్తున్నారు.